మహిళల సమానత్వం మన ఇంటినుంచే మొదలవ్వాలి : కలెక్టర్ క్రాంతి

మహిళల సమానత్వం మన ఇంటినుంచే మొదలవ్వాలి : కలెక్టర్ క్రాంతి

సంగారెడ్డి టౌన్, వెలుగు: మహిళల సమానత్వం మన ఇంటి నుంచే మొదలవ్వాలని, ఇంట్లో మగ పిల్లలను, ఆడపిల్లలను సమానంగా చూడాలని కలెక్టర్ క్రాంతి  అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి కలెక్టరేట్ లో జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా ముఖ్యమని, వారిని అన్ని రంగాల్లో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పం అన్నారు. 

చదువే మహిళా సాధికారతకు ఆధారం

అమ్మాయిల చదువు ఆ కుటుంబానికి వెలుగునిస్తుందని కలెక్టర్ అన్నారు. తల్లిదండ్రులు తమ కుమార్తెకు పూర్తి స్వేచ్ఛను ఇస్తూ మంచి విద్యను అందించాలని సూచించారు. కేజీబీవీ, గురుకుల స్కూళ్లలో, వసతి గృహాల్లో చదువుతున్న బాలికల భవిష్యత్​ కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.  మగపిల్లలకు మహిళలను గౌరవించే విధంగా విలువలు నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ , ప్రైవేటు రంగాల్లో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ మహిళల సంఖ్య ఇంకా పెరగాలన్నారు.

మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందిస్తుందని తెలిపారు. గర్భిణీలు, బాలింతలు, బాలికలకు సరైన పోషకాహారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోందన్నారు. కార్యక్రమంలో డీఆర్​వో పద్మజారాణి, జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, డీఆర్డీఏ పీడీ జ్యోతి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వసంతకుమారి, వివిధ శాఖల మహిళా ఉద్యోగులు, మహిళా సంఘాలు, స్టూడెంట్స్​ పాల్గొన్నారు.